Subtotal: ₹12,116.00
You have 2 items in your cartVeda Smarta Vidya Nilayam
₹11,116.00
శ్లో ॥ కుక్షౌ తిష్ఠతి యస్యానం వేదాభ్యాసేన జీర్యతే ।
కులం తారయతే తేషాం దశపూర్వం దశాపరమ్ ॥
అర్థం : ఎవరైతే వేదాభ్యాసము చేసే విద్యార్థులకు అన్నదానం చేస్తున్నారో ఆ అన్నము విద్యార్థి యొక్క ఉదరములో వేదము చదవటం వల్ల జీర్ణము అవుతుందో ఆ అన్నదానం చేయటం వల్ల వారి యొక్క కులము ‘దశపూర్వం’ పది తరాల ముందు వారు, ‘దశాపరం’ పది తరాల తరువాత వారు తరిస్తారు. అంటే వేదమును చదివించిన వార్లకు (వేద విద్యాలయ నిర్వహణకు తోడ్పడినవార్లకు), గురువు యందు శ్రద్ధాభక్తులతో ఉండి చదివిన వార్లకు, తను అభ్యసించిన విద్యను తన గురువు గారి వలే శ్రద్ధాభక్తులతో అధ్యాపక వృత్తి ద్వారా వేద విద్యను వ్యాప్తి చేసినవారికి ముక్తి కలుగుతుంది.
వాశిష్ఠ, కపిలాది మహర్షుల చేత పునీతము చేయబడిన అనేక మహనీయుల ఆశీస్సులతో లోక క్షేమార్థము సర్వజనుల శుభముల కొరకు అన్ని ధర్మములకు మూలమైన వేదముల ఉద్ధరణకై హైదరాబాదు పట్టణమునందు శ్రీ లక్ష్మీగణపతి వేద స్మార్త విద్యానిలయం గురువరేణ్యులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి దివ్య ఆశీస్సులతో, పెద్దల ఆశీర్వాదములతో స్థాపించి నిర్వహింపబడుచున్నది.
ఇందులకై అందరి సహాయ, సహకార, సలహాలు అర్థించడమైనది.
ప్రాచీన గురుకుల పద్ధతిలో ఉచితముగా భోజన, వసతి ఏర్పాట్లు చేసి వేద స్మార్త గురువులచే శ్రీ కృష్ణయజుర్వేదము నేర్పించి వేదమాత అనుగ్రహముచే వేద స్మార్త పండితులుగా తీర్చి దిద్దాలనే సత్సంకల్పముతో ఉన్నాము. అలాగే ధర్మశాస్త్ర యుక్తముగా సశాస్త్రీయ స్మార్త పరీక్షలను కూడా ప్రసిద్ధ పరీక్షాధికారులచే పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి జయపత్రికలను (సర్టిఫికెట్లు) ఒసంగి, విద్యార్థులను ప్రోత్సహించుటకై మా ఈ శ్రీలక్ష్మీగణపతి వేదిక్ పౌండేషన్ ట్రస్టు మాత్రమే అని కూడా అందరకు విదితమే.
వేద ప్రాశస్త్యం
కాణ్డద్వయోపపాద్యాయ కర్మబ్రహ్మ స్వరూపిణే । స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః ॥
కుక్షౌ తిష్ఠతి యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే ।
కులం తారయతే తేషాం దశపూర్వం దశాపరమ్ ॥
అపౌరుషేయాలు అయిన వేదాలు భగవంతుడి నిశ్వాసముగా వెలువడ్డాయి. అందువల్లనే వేదములను తార్కికులు కూడా ప్రమాణముగా అంగీకరించారు. అటువంటి వేదాలు లోక క్షేమం కోసం ధర్మాన్ని ఉపదేశించడం మాత్రమే కాకుండా కల్పవృక్షముల వలె అర్థకామాలను ప్రసాదించి మన కష్టాలను పోగొడుతూ మాతృస్థానీయములై ఉన్నవి. అలాగే వేదములు చివరలో గంభీరమైన వేదాంత తత్వాన్ని ఉపదేశించి సోపానములై మోక్షద్వారం వద్ద నిలుపుతున్నాయి. ఈ విధంగా నాలుగు పురుషార్థాలను మానవాళికి అనాదిగా అందిస్తూ మన జీవితాలను అర్థవంతంగా చేస్తున్నాయి. మనం భగవంతుడిని చేరడానికి ఎన్నో క్రతువులను, అనుష్ఠానములను, ఉపాసనలను తెలియజేస్తూ ప్రతి అక్షరం ఎంతో పవిత్రమైనవై, అన్నవారిని, విన్నవారిని కూడా పావనం చేస్తున్నాయి. అటువంటి వేదాలను సంరక్షించడం, వేదోక్తకర్మలను ఆచరించడం, వైదికమైన కార్యములకు సహకరించడం మనందరి కర్తవ్యము, మనకు శుభదాయకము.
ఎంతో శ్రమసాధ్యమైన ఈ కార్యక్రమం ఆస్తిక వరేణ్యుల సహాయ సహకారాల ద్వారా నిరాటంకంగా కొనసాగాలని ఆశిస్తున్నాము. ప్రతీ ఒక్కరూ దయచేసి తమ సహాయ సహకారాలను అందించి వేదమాత అనుగ్రహానికి పాత్రులు కాగలరు. మన సంస్కృతీ సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత. అటువంటి బుద్ధిని శక్తి సామర్థ్యాలను భగవంతుడు మనందరికీ అనుగ్రహించు గాక
In Stock
Recent Views
Magha Abhisheka Mahotsav 2025
₹5,116.00
Description
శ్రీవేదమాత్రే నమః
జగద్గురువులు శ్రీశ్రీశ్రీ కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధిపతులు పరమ పూజ్యులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ శ్రీ చరణుల దివ్యాశీరనుగ్రహములతో ప్రతి సంవత్సరము జరుపబోవు వార్షిక స్మార్త విద్వత్సమావేశములు-పరీక్షలు హైదరాబాదులోని శ్రీ లక్ష్మీగణపతి వేదిక్ ఫౌండేషన్ ట్రష్టు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు మరియు పైడిమర్రి రామశంకర శర్మ గార్ల ఆతిథ్య సౌజన్యముల ఆహ్వానము మేరకు హైదరాబాదులో నిర్వహింపబడనున్నవి. ఈ వార్షిక స్మార్త విద్వత్సభలకు అనేకమంది స్మార్త విద్యార్థులు, వేద విద్యార్థులు, స్మార్త-వేద విద్వాంసులు రాగలరు. విద్యార్థులకు ప్రవేశ, పంచదశ కర్మాన్త, స్మార్త కోవిద, స్మార్త విద్యా విశారద అను 4 విభాగములలో పరీక్షలు నిర్వహించబడును.
యావత్ భారత సనాతన, సంస్కృతి, సదాచార ప్రాంతములలో 4 వేదములలోను, అలాగే ధర్మశాస్త్ర యుక్తముగా సశాస్త్రీయ స్మార్త పరీక్షలను కూడా ప్రసిద్ధ పరీక్షాధికారులచే పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి జయపత్రికలను (సర్టిఫికెట్లు) ఒసంగి, విద్యార్థులను ప్రోత్సహించుటకై మా ఈ శ్రీలక్ష్మీగణపతి వేదిక్ పౌండేషన్ ట్రస్టు మాత్రమే అని కూడా అందరకు విదితమే.
ప్రముఖ విద్వాంసులచే సందర్భోచితముగా ప్రసంగములు, స్తార్త ధర్మ శాస్త్ర విషయాదులపై అవగాహనా కార్యక్రమములు నిర్వహించబడును. ఈ కార్యక్రమములలో ప్రముఖ పీఠాధిపతులు, వేదశాస్త్ర పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు మున్నగు పెద్దలు పాల్గొనెదరు.
ఈ సందర్భముగా లోకకళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము నిర్వహించబడును.
వేద కల్పవృక్షమునకు వేదాంగములే (వ్యాకరణ, మీమాంసాది శాస్త్రములు) శాఖలు, శ్రౌత, స్మార్తాది విద్యలు ఉపశాఖలు (కొమ్మలు-రెమ్మలు). కనుక, వేద పరీక్షలతో పాటు వేదాంగములందు, వేద భాష్యములందు, ఆగమ విద్యలందు కూడా సహజముగానే పరీక్షలను నిర్వహించవలసి ఉన్నను, కార్య నిర్వాహణ భారము, ఆర్థిక వసతుల దృష్ఠ్యా ఆ పని సమీప భవిష్యత్తులో చేపట్టుటకు తగు ప్రయత్నములు జరుగుచున్నవి.
2009 అక్టోబరు నెల శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్ ట్రస్టు ద్వారా విద్యార్థుల శిక్షణ నిమిత్తమై అనేక యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించి నాలుగు వేదములు, వాటి శాఖలలోను పరీక్షలు నిర్వహించుచున్న విషయము అందరకు విదితమే. వార్షికముగా ఈ పరీక్షలు నిర్వహించుట వలన, విద్యార్థులు క్రమం తప్పకుండా పరీక్షలలో పాల్గొనుచూ, వారి విద్యాభివృద్థిని చేసుకుంటూ, క్రమ పాఠీలుగా, ఘనపాఠీలుగా ఉత్తీర్ణులై వేద పారాయణదారులుగా స్థిరపడుట కూడా మనందరికీ సంతోషదాయకము.
గత కొన్ని సంవత్సరాలుగా క్రమము తప్పకుండా ఈ జ్యోతిష్య, వాస్తు స్మార్త , తర్క, మీమాంస, వ్యాకరణ, వేద సభలు నిర్వహించుట వలన, స్మార్త పరీక్షల ఆవశ్యకతను విద్యార్థులు గుర్తించి ఆయా విభాగములలో ఉత్తమముగా పరీక్షలనిచ్చి, త్వరలో స్మార్త విద్యా విశారద జయపత్రిక లను పొందవలెననెడి పట్టుదల, ఉత్సాహము విద్యార్థులలో పెరిగినదని నిస్సందేహముగా చెప్పవచ్చును. అలాగే ఈ స్మార్త సభలు నిర్వహించుట వలన, ఆయా ప్రాంతములలో స్మార్త విద్య యందు ఆసక్తి, పట్టుదల పెరుగుట, క్రొత్త స్మార్త పాఠశాలలు నెలకొల్పుట, తద్వారా సమాజములో ఉత్తమమైన స్మార్త విద్వాంసులు తయారుకావాలి అనెడి ఆకాంక్ష కూడా ఆస్తికులలో ప్రబలినదని నిస్సందేహముగా చెప్పవచ్చును.
కాగా, గత సంవత్సరము వరకు కొంతమంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలలోను, మరికొంతమంది పంచదశ కర్మాన్త పరీక్షలలోను, 10 మంది స్మార్త క్రియా కోవిద పరీక్షలలోను, ఒక్కరు స్మార్త విద్యా విశారద పరీక్షలలోను ఉత్తీర్ణులై జయపత్రికలు పొందినారు.
ఇటువంటి ఈ వార్ఫిక సభలు, పరీక్షలు అవిచ్ఛిన్నముగా ప్రతి జిల్లాలోను నిర్వహించి, ఆ జిల్లా ప్రజలలో సనాతన వైదిక సంస్కృతిని పునరుజ్జీవింప చేయుటయే కాకుండా ఆ ప్రాంత విద్యార్థులను ఉత్తమ స్మార్త విద్వాంసులుగా కూడా తయారుచేయుట ద్వారా అచిరకాలములోనే తెలుగు రాష్ట్రాలే కాకుండా అనేక చోట్ల ఈ వేద విద్యను విస్తృత పరిచి సనాతన వైదిక సాంప్రదాయ నిలయములు అనెడి పూర్వ వైభవమును తిరిగి పొందగలమని
ఆశిస్తున్నాము.
అందువల్ల వేద, శాస్త్ర, జ్యోతిష్య, వాస్తు శాస్త్రములలో మరియు స్మార్త విద్వాంసులు, వైదిక ధర్మాభిమానులందరు వేద విద్వన్మహా సభలు ` వేదపరీక్షలు వలెనే వాటికి అనుబంధములగు ఈ స్మార్త విద్వత్సభలు ` పరీక్షల కార్యక్రమములో కూడా పాల్గొని సంపూర్ణముగా విజయవంతములు అగునటుల మా ఈ ప్రయత్నమును ప్రోత్సహించి తగు సహాయ సహకారముల నందించగలరని ప్రార్థన.
సంస్థ లక్ష్యాలు
శ్రీలక్ష్మీగణపతి వేదిక్ ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా భాగ్యనగరములో వేద స్మార్త పాఠశాలను నిర్వహించుచున్నాము. మన పాఠశాలలో అనేక మంది విద్యార్ధులు శ్రీ కృష్ణ యజుర్వేదము, సంస్కృత సాహిత్యం అభ్యసించుచున్నారు. ఇటువంటి మరిన్ని వేద స్మార్త పాఠశాలలను మన సంస్థ ద్వారా ఇతోధికంగా స్థాపించి నిర్వహించాలని తద్వారా వేదపరిరక్షణ చేయాలని మా సంకల్పం. అదేవిధంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని సన్మానించుట ద్వారా వారిలో వైదిక మార్గం పట్ల శ్రద్ధాసక్తులను పెంపొందించాలని వేదశాస్త్ర సంవర్థనీ సభలను ప్రారంభించడమైనది. ఈ వేదిక ద్వారా గత కొన్ని సంవత్సరాల నుండి వేదములో, సంస్కృత సాహిత్యములోనూ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించుట జరుగుచున్నది. ఈ సందర్భంగా విచ్చేయుచున్న పరీక్షాధికారులకు, 200 మంది విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఆహూతులకు, అతిధులకు, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీగణపతి వేదిక్ ఫౌండేషన్‌లో భోజన వసతులు ఏర్పాటుచేయబడుచున్నవి. అనేక మంది ఉభయదాతలు ప్రతి సంవత్పరము మనకు పరీక్షల సమయంలో ఉచితంగా వసతి సౌకర్యం ఏర్పాటు చేయుచున్నారు. పరీక్షాధికారులకు, విద్యార్థులకు సత్కారాలు మరియు ఆహార ఏర్పాట్లు ఎందరో ఉదారులైన దాతల సహాయ సహకారములు, విరాళాల ద్వారా జరుగుచున్నవి. ఈ సంవత్సరం పరీక్షలకు కనీసం 250 మంది విద్యార్థులు రావాలని కోరుకుంటున్నాము. పరీక్షలకు విచ్చేయుచ్ను విద్యార్థులకు పరీక్షాధికారులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సత్కారాలు, సన్మానాలు, అతిథి మర్యాదల నిర్వహణకు ఆస్తికులైన దాతలు సహృదయంతో స్పందించి తగిన చేయూతను తోడ్పాటును ఇతోధికంగా అందించవలసినదిగా కోరుతున్నాము.
కార్యక్రమ వివరములు
మొదటి రోజు
ఉదయం 07 గంటలకు గ్రామోత్సవం
ఉ॥ 8-00 గం॥లకు గురు వందనం
ఉ॥ 8-30 ని॥లకు 11-30 గం॥ల వరకు వేద స్మార్త పరీక్షలు
మ॥ 3-00 గం॥ల నుండి రా॥ 7-00 గం॥ల వరకు పరీక్షలు
రెండవ రోజు
ఉ॥ 8-30 ని॥లకు 11-30 గం॥ల వరకు వేద స్మార్త పరీక్షలు
మ॥ 3 గం॥ల నుండి రా॥ 7 గం॥ల వరకు పరీక్షలు
రా॥ 7-30 ని॥లకు నీరాజన మంత్రపుష్పాలు
రా॥ 8 గం॥లకు తీర్థప్రసాద వితరణ
మూడవ రోజు
ఉ॥ 7 గం॥లకు సీతారాములకు సుప్రభాత సేవ, అనంతరం సహస్రనామార్చన
ఉ॥ 10 గం॥లకు సీతారాముల కళ్యాణోత్సవం
మ॥ 12 గం॥లకు అన్నప్రసాద వితరణ
మ॥ 2 గం॥ల నుండి వేద విద్వత్సభ, చతుర్వేద స్వస్తి
మ॥ 3 గ॥ల నుండి అతిధుల ప్రసంగాలు
మ॥ 3-30 ని॥ల నుండి 4`15 వరకు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాప్రదానం
మ॥ 4-15 నుండి 5 గం॥ల వరకు పరీక్షాధికారులకు విద్వాంసులకు సత్కారాలు
సా॥ 5 గంటలకు గురు వందనం
స్మార్త విద్య పరీక్షల ప్రణాళిక
1. ప్రస్తుతము ఈ పరీక్షలు శ్రీ కృష్ణ యజుర్వేదీయ ఆపస్తంభ శాఖ వరకే పరిమితము.
2. ఈ పరీక్షలు విద్యార్థుల సౌకర్యార్థము 4 కక్ష్యలలో నిర్వహింపబడును.
1. ప్రవేశ పరీక్ష 2. పంచదశ కర్మాన్తము
3. స్మార్త క్రియా కోవిద 4. స్మార్త విద్యా విశారద
3. ప్రవేశ పరీక్ష : అర్హత క్రింద పేర్కొన్న నియమాల మేరకు.
4. పంచదశ కర్మాన్తం : ప్రవేశ పరీక్ష పూర్తి అయిన వారే దీనికి అర్హులు.
5. స్మార్త క్రియా కోవిద : పంచదశ కర్మాన్తం పరీక్ష పూర్తి అయిన వారే దీనికి అర్హులు
6. స్మార్త విద్యా విశారద : స్మార్త క్రియా కోవిద పరీక్ష పూర్తి అయిన వారే దీనికి అర్హులు
గమనిక :
(1) పైన పేర్కొన్న పరీక్షాంశములు సూచనా మాత్రమునకై సూచనా మాత్రమనకై సూక్ష్మముగా పేర్కొనబడినవి.
(2) ఉత్తీర్ణులైన విద్యార్థులకు జయ పత్రికతో పాటు యథోచిత సత్కారము ఉండును.
(3) స్మార్తవిద్యని సంస్థ గుర్తించిన సాంప్రదాయిక విద్వాంసుల వద్దనే నేర్చుకుని ఉండవలెను.
(4) మంత్రభాగమున స్వరము, ఉచ్ఛారణ నిర్దుష్ఠముగా ఉండవలెను.
(5) పరీక్షాంశములు, నియమములు, విద్యార్థుల అర్హత మున్నగు విషయములన్నిటా నిర్వాహకులదే తుది నిర్ణయము.
(1) ప్రవేశ పరీక్షాంశముల వివరములు
స్నాన ప్రకరణము, భస్మ ధారణ, సంధ్యావందనము, యజ్ఞోపవీత ధారణము, అగ్నికార్యము, బ్రహ్మయజ్ఞము, దీపారాధన, విఘ్యేశ్వర పూజ, పుణ్యాహవాచనము, కర్హణః పుణ్యాహవాచనము, నమకము, చమకము, పురుష సూక్తము, శ్రీ సూక్తము, భూ సూక్తము, మన్యు సూక్తము, నీళా సూక్తము, మహాన్యాసము, దశ శాంతులు, సామ్రాజ్య పట్టాభిషేక మంత్రములు, పురుష సూక్త విధానేన దేవతార్చనం, పూజలు, శ్రీ సూక్త విధాన పూజలు, నీరాజన మంత్ర పుష్పములు, చతుష్పాత్రము, షట్పాత్రము, జయాదులు, రాష్ఠ్రభృతులు, ప్రాయశ్చిత్త హోమము (ముఖాహుతి / శమ్య, పరిధి వివరములు ), పూర్ణాహుతి, నవగ్రహారాధన, నవగ్రహ మఖము, నక్షత్రేష్ఠి (స్వాహాకార సహితము), సామాన్య శాంతి ప్రయోగము.
అనుబంధము : శబ్దములు, ధాతువులు, అవ్యయములు, సమాస పరిచయము, సంస్కృత వాక్య నిర్మాణము (ప్రధానముగా శబ్దమంజరి ఆధారముగా)
(2) పంచదశ కర్మాన్త పరృక్షాంశముల వివరములు
అంకురారోపణ, రక్షాబంధన, నాన్దీ ప్రకరణము, అనుపనీత ప్రాయశ్చిత్తము, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌలము, ఉపనయనము, పాలాశకర్మ, ఉపాకర్మ, వేద వ్రతములు (ప్రాజాపత్య, ఆగ్నేయ, సౌమ్య, వైశ్వదేవవ్రతములు) ఉత్సర్జనము, గోదాన వ్రతము, స్నాతకము, వివాహము, ప్రధాన హోమము, యధృతాది హోమము, ప్రవేశ హోమము, ఆగ్నేయ స్తాళీపాక ఔపాసన హోమములు, గంధర్వస్తాపనము, సదస్యము (మహదాశీర్వాదము), శేషహోమము, నాకబలి, దీక్షామధ్యే అగ్నినష్ట ప్రాయశ్చిత్తము, విచ్చిన్నాగ్ని పునస్సంధానము, ఔపాసన లోప ప్రాయశ్చిత్తము, తంతుమతీ హోమములు, గర్బదానము, పుంసువనము, సీమన్తము, ఆశీర్వచన మంత్రములు, శంకుస్తాపన, గ్రుహప్రవేశ, వాస్తు హోమములు, సత్యనారాయణాది వ్రతములు (కథా విధానముతో సహా), జనన శాన్తులు ( ముఖావలోకనము, గోముఖ ప్రసవము, నక్షత్ర శాన్తులు), రజస్వలా శాంతి, గ్రహణ శాన్తులు.
(3) స్మార్త క్రియా కోవిద పరీక్షాంశముల వివరములు
మంత్రపన్నములు, రుద్ర ఆయుష్య ఆవహన్తీ హోమములు, వసోర్థార, ఉదకశాంతి,
శ్రాద్ధ ప్రకరణము : అన్నసూక్త, త్రిసుపర్ణములు, అధిశ్రవణము (నాచికేతాన్తము), ఆబ్ధికము, దర్శ, తీర్థ, పుష్కర, మహాలయ శ్రాద్ధములు, హిరణ్యశ్రాద్ధము.
అపర ప్రకరణము : సర్వప్రాయశ్చిత్తము, దహనము, నిత్య నగ్న ఆహ్నిక ప్రయోగములు, అస్థి సంచయనము, అస్థి నిక్షేపణము, దశాహము, వృషోత్సర్జనము, ఏకోద్దిష్ట శ్రాద్ధము, షోడశ శ్రాద్ధము, సపిండీకరణము.
అనుబంధము : సంస్కృత భాషణము, కావ్య పరిచయము (రఘువంశ / కుమారసంభవాది కావ్యములలో (విద్యార్థి సిద్ధమైన) ఏవైనా 2 సర్గలు ` సవ్యాఖ్య. వాటి ( పదవిభాగ / ప్రతిపదార్థ / తాత్పర్య / ఆకాంక్ష / శబ్ద ` సమాస` సంధి` ధాతు వివరణతో వ్యాఖ్యానమును చూచి వివరించవచ్చును).
(4) స్మార్త విద్యా విశారద పరీక్షాంశముల వివరములు
పంచ కాఠకములు, పంచోపనిషత్తులు, ఆపస్తంభ గృహ్య సూత్రములు (వ్యాఖ్యానముతో సహా), ఉగ్రరథ శాన్తి, భీమరథ శాన్తి, సహస్రచంద్రదర్శన శాన్తి, మహాలింగార్చన, సహస్ర లింగార్చన, విశేష శాన్తులు.
అనుబంధము : ధర్మ శాస్త్ర నిరూపణము (సప్రమాణము)
1. వర్ణాశ్రమ ధర్మములు : గృహ / కులాచారములు.
2. ప్రాతఃకాలకృత్యములు : స్నాన, ఆచమన, వస్త్రధారణ, పుండ్రధారణ, పూజ, హోమద్రవ్య. దీపారాధన, జప, హోమ, తర్పణ, భోజన తీర్థ, ప్రసాద వినియోగ పద్దతులు, పంచాయతన విన్యాస విధానము, స్త్రీ , శూద్ర, అనుపనీత, కన్యా, రజస్వలాది అశౌచ విషయములు.
విరాళములను పంపు దాతలు ఈ క్రింది చిరునామా నందు సంప్రదించగలరు.
శ్రీ లక్ష్మీగణపతి వేదిక్ ఫౌండేషన్, 4-50/9, బాబానగర్, నారపల్లి గ్రా॥, ఘట్‌కేసర్ మం॥, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మీ యొక్క అమూల్యమైన విరాళము చెక్కు / డిమాండు డ్రాప్టు ద్వారాగానీ శ్రీ లక్ష్మీగణపతి వేదిక్ ఫౌండేషన్ ట్రస్టు పేరున పంపి, వాటి వివరములను మాకు వాట్సాప్ 9440054929 లేదా ఈ మెయిల్ slgvedicfoundation@gmail.com ద్వారా తెలియజేసి రశీదును పొందగలరు. నగదు రూపములో విరాళములను ఇచ్చువారు రశీదును తప్పక తీసుకొనవలసినదిగా ప్రార్థన.
బ్యాంకు వివరములు
శ్రీలక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్
అకౌంటు నెంబరు : 108 1111 00000 256
IFSC Code : UBIN0820661,
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, మేడిపల్లి శాఖ, హైదరాబాదు
ముఖ్యగమనిక : ఈ సంస్థ ఆదాయపు పన్నుశాఖలో సెక్షన్ 80 జి క్రింద నమోదు అయి పన్నుమినహాయింపును కలిగి ఉన్నది.


Reviews
There are no reviews yet.